రవి రాకలో ఆంతర్యమేమిటో!?

 హైదరాబాద్: కేంద్ర మంత్రి వాయిలార్ రవి నేడు నగరానికి వస్తున్నారు. రాష్ర్ట గవర్నర్ నరసింహన్ ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే రవి హైదరాబాద్కు రావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. రవి రాష్ర్ట పర్యటనపై అనేక అనుమనాలు, రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాష్ర్ట నాయకత్వంపై మార్పు గురించి ఇక్కడి నేతల అభిప్రాయాలను తెలుసుకునేందుకు వస్తున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. ఢిల్లీ వెళ్లిన రాష్ర్ట గవర్నర్ కేంద్ర మంత్రులు సుశీల్ కుమార్ షిండే, చిదంబరం, గులాంనబీ ఆజాద్, జైపాల్ రెడ్డి తదితరులను కలిసిన విషయం విధితమే.  ఉప రాష్ర్టపతి ప్రమాణస్వీకారోత్సవానికి వెళ్లినట్లు చెబుతున్నప్పటికీ రాష్ర్టంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ఢిల్లీ పెద్దలకు నివేదికను ఇచ్చినట్లు తెలుస్తోంది. గవర్నర్ ఎన్నడూ లేనిదీ ఈ దఫా ఢిల్లీ పర్యటనలో మన రాష్ర్టానికి చెందిన జైపాల్ రెడ్డిని కలిశారు. సుమారు గంటకుపైగా వీరిద్దరు సమావేశమయ్యారు. సీఎం కిరణ్కు, జైపాల్ రెడ్డి మధ్య గ్యాస్ కేటాయింపులు పెట్టిన మంటలు అందరికీ తెలిసిందే. ప్రస్తుతం రాష్ర్టంలో జైపాల్-కిరణ్ ల అంతర్యుద్దం రసవత్తరంగా సాగుతోంది. ఈనేపథ్యంలో గవర్నర్ ఢిల్లీలో జైపాల్ రెడ్డిని కలువడం...తరువాత మీడియాతో మాట్లాడుతూ గ్యాసే లేనప్పుడు గ్యాస్ కేటాయింపులు ఎలా సాధ్యమంటూ పరోక్షంగా సీఎంకు వ్యతిరేకంగా జైపాల్కు మద్దతుగా పలికారు. ఢిల్లీలో గవర్నర్ మాట్లాడిన తీరును బట్టి రాష్ర్టంలో నాయకత్వ మార్పు ఏమైనా జరగవచ్చనీ ప్రచారం ఊపందుకుంది. ఇటు హైదరాబాద్ లో కూడా ఓ సమావేశంలో పాల్గొన్న కేశవరావు కూడా తెలంగాణ సాధించుకోవాలంటే కిరణ్ సర్కార్ను దించేసేందుకు తెలంగాణకు చెందిన 20మంది శాసనసభ్యులు సిద్ధమవ్వాలనీ పిలుపునిచ్చారు. అటు ఢిల్లీలో కూడా సీఎం కిరణ్కు వ్యతిరేకంగా గవర్నర్ మాట్లాడటం బట్టి కిరణ్ సీటుకు ఏమైనా ఎసరు వస్తుందా? అనే అనుమానం అందరికీ కలుగుతోంది. పార్టీ నాయకుల్లో ఊహాగానాలు ఊపందుకున్నాయి. గత కొన్ని రోజులుగా కూడా ఆగస్టు 15తరువాత సీఎం మార్పుఅంటూ వార్తలొస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే ఢిల్లీలో గవర్నర్ మాట్లాడటం....మరికొన్ని గంటల్లో కేంద్ర మంత్రి రవి గాంధీభవన్కు చేరుకుంటుండం ఒకదాని వెనక ఒకటి చకచక జరిగిపోతున్నాయి. గవర్నర్ ఢిల్లీలో సీఎంకు వ్యతిరేకంగా నివేదిక ఇచ్చాడనీ, దానిలో నిజమెంతో తెలుసుకోవడానికే వాయిలార్ రవి హైదరాబాద్ వస్తున్నారనే ప్రచారం కూడా పార్టీలో జరుగుతోంది. మొత్తానికి వాయిలార్ రవి పర్యటనపై పార్టీలో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: